భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, జులై 2026, బుధవారంభారత్ సమాచార్

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

WhatsApp Image 2026-07-21 at 4.51.53 PM

 

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిపాలనా నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చట్టపరమైన నిబంధనల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

సైబర్ నేరాల నివారణకు విలేజ్ పోలీస్ ఆఫీసర్లు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ లింకుల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న ఎస్పీ, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించడంతో పాటు దర్యాప్తులో కీలక ఆధారాలు లభిస్తాయని తెలిపారు. ఈ తనిఖీలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, ఎస్‌ఐలు రంజిత్ రెడ్డి, జగన్మోహన్, కృష్ణయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.