భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భండారి శాంతికుమార్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు అరాచకానికి పాల్పడి దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆ చర్యలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం, అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ప్రతిపక్షాల గొంతును పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని భండారి శాంతికుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని మండిపడ్డారు.
పోలీసు నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టలేరని స్పష్టం చేసిన భండారి శాంతికుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం మరింత ఉద్ధృతంగా కొనసాగుతుందని హెచ్చరించారు.