భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించి భూగర్భ జలాల పెంపు, సంరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (VB-GRAMJI) కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపు చర్యలపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల అమలుపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాల పునరుద్ధరణకు ఇదే అనువైన సమయమని పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు (రీఛార్జ్ పిట్స్) నిర్మించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. నీటి భద్రత కోసం ఫామ్ పాండ్లు, వ్యక్తిగత ఫామ్ పాండ్లు, బోరుబావుల రీఛార్జ్ పిట్స్, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, పర్కోలేషన్ ట్యాంకుల నిర్మాణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పనుల అమలులో నిర్లక్ష్యం లేదా ఆలస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి మండలంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించి లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రైతులకు ఉపయోగపడే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్యతో పాటు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.