భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎ.వి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా భక్తుల కోసం పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఉదయం 6 గంటలకు కాకడ ఆరతితో కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, అనంతరం ఉదయం 6.30 గంటలకు పురుషసూక్త విధానంలో మహాభిషేకం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
మధ్యాహ్నం మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీతో పాటు మహా అన్నప్రసాదం (అన్నదానం) నిర్వహించనున్నారు. గురు పౌర్ణమి రోజున జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని సాయిబాబా వారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ వ్యవస్థాపకులు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎ.వి. స్వామి, వారి కుటుంబ సభ్యులు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. “రండి… సాయిబాబా ఆశీస్సులు పొందండి” అంటూ భక్తులకు హృదయపూర్వక ఆహ్వానం పలికారు.