భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 4,53,140 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను 100 శాతం పంపిణీ చేయగా, ఇప్పటివరకు 90 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. మరో రెండు నుంచి మూడు రోజుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించనున్నట్లు తెలిపారు.
బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను తెలియజేశారు. ఓటర్ల నుంచి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగంగా పూర్తి చేస్తూనే, నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు. ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో 1,200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేంద్రాలు, అలాగే 2 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్లకు సౌకర్యవంతమైన పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, అన్ని జిల్లాలు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో పొరపాట్లు జరగకుండా ఈఆర్వోలు (EROలు) యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, సెక్షన్ సూపరింటెండెంట్ గఫార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.