భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన అనుమతి లేకుండా తన ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నారని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఆమె చిత్రాలను వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
ఆమె వ్యక్తిగత హక్కులను దుర్వినియోగం చేయరాదని.. ఈ రకమైన దుర్వినియోగం ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు ఆమె గౌరవ, ప్రతిష్టకు భంగం కల్గిస్తుందని కోర్టు పేర్కొంది. ఇకపై ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఆమె పేరును వాడడానికి వీల్లేదని.. ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అలాగే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అనేక ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ సమాచార శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ కేసులో తదుపరి విచారణను 2026 జనవరి 15 వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.
మరిన్ని కథనాలు:
Samantha: ఉన్నంతలో సంతోషంగా ఉన్నాను: నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు