భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో చేపట్టిన “అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర” సోమవారం ఇనుగుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఇనుగుర్తి కల్లు గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడు ఉమ్మగాని మల్లయ్య ఆధ్వర్యంలో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, గౌడ సమాజ సేవకుడు దివంగత గండు ఐలయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ, గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, ప్రమాదాల్లో మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
తాటి, ఈత చెట్లు ఎక్కడానికి అవసరమైన రక్షణ కిట్లు, భద్రతా పరికరాలను పూర్తిస్థాయిలో అందించాలని, గీత కార్మికులకు మెరుగైన భద్రతా సౌకర్యాలు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, గీత కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్న రాష్ట్ర చైతన్య యాత్రకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రతిపాదించిన న్యాయమైన డిమాండ్లను స్థానిక ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ సహకారంతో రాజ్యసభ సభ్యుడు వేంనరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి వద్ద పరిష్కారం కోసం కృషి చేస్తానని చిలువేరు సమ్మయ్య గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గౌని వెంకన్న, జిల్లా కార్యదర్శి యమగాని వెంకన్న, మండల అధ్యక్షుడు బబ్బురి ఉప్పలయ్య, మండల కార్యదర్శి మోడెం వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మగాని మల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, సీనియర్ గౌడ నాయకుడు బైరి అశోక్, కేజీకేఎస్ మండల కార్యదర్శి గండు నాగన్న, గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూటికంటి మధు, కోశాధికారి వేముల శ్రీనివాస్, గీత కార్మికులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.