భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, ఆగస్టు 2026, బుధవారంభారత్ సమాచార్

నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను సంరక్షించాలి

778437aa-55e4-4122-a8fb-bb0d1e226e40

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నీటి వనరులను సంరక్షిస్తూ భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి చిర్ర యాకాంతం గౌడ్ పిలుపునిచ్చారు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళల భద్రత వంటి పలు కీలక అంశాలపై గ్రామసభలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

సర్పంచి యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో పంట గుంతలు, ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటితో పాటు గృహ అవసరాలకు వినియోగించిన నీటిని కూడా ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్‌లో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. నీటి వృథాను నివారించడం ద్వారా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

గ్రామంలోని బాలికలు, మహిళల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించిన ఆయన ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఆకతాయిల కదలికలపై నిఘా ఉంచి, అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. మహిళల భద్రతకు గ్రామస్థాయి సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలో పరిశుభ్రతను మెరుగుపరచడం, క్రిమికీటకాల నివారణతో పాటు తాగునీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులకు బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎర్ర రవి, ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, వార్డు సభ్యులు పిడుగు అనంత, బొల్లు మురళి, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.