భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, ఆగస్టు 2026, బుధవారంభారత్ సమాచార్

సాయి పల్లవి సీత లుక్‌పై ట్రోల్స్.. సమాధానం ఇదే

155217748

భారత్ సమాచార్, సినిమా డెస్క్: బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ జూలై 30న విడుదల కాగా, అప్పటి నుంచి సినిమాలోని నటీనటుల లుక్స్, కాస్ట్యూమ్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి, కైకేయి పాత్రలో కనిపిస్తున్న లారా దత్తా లుక్స్‌పై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు టీవీ సీరియల్స్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఈ విమర్శలపై ‘రామాయణ’ కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ స్పందించారు. ఇలాంటి అభిప్రాయాలు, పోలికలు వస్తాయని ముందే ఊహించామని వారు తెలిపారు. రామాయణం తరతరాలుగా ప్రజల మనసుల్లో ఉన్న గొప్ప ఇతిహాసమని, ఇందులో పాత్రల రూపకల్పనపై ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయం ఉంటుందని పేర్కొన్నారు.

కాస్ట్యూమ్ డిజైనర్ రింపుల్ మాట్లాడుతూ, సీతాదేవి పాత్రను కేవలం పురావస్తు ఆధారాలతో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక భావన, తన ఊహలో ఉన్న దైవిక రూపంతో రూపొందించామని తెలిపారు. “సీతాదేవిని దేవాలయంలో దర్శించినప్పుడు కలిగే భావనను తెరపై చూపించాలనుకున్నాం. రీసెర్చ్ కాస్ట్యూమ్ డిజైన్‌కు పునాది. అయితే దానికి కళాత్మకతను జోడించడం అవసరం” అని వివరించారు. ప్రాచీన కాలం నాటి వస్త్రాలు అందుబాటులో లేకపోవడంతో శిల్పకళ, క్యాలెండర్ ఆర్ట్, రాజా రవి వర్మ చిత్రాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకున్నట్లు చెప్పారు.

కైకేయి పాత్ర కాస్ట్యూమ్స్ గురించి హర్‌ప్రీత్ వివరిస్తూ ఆకుపచ్చ రంగు మాతృత్వానికి, ముదురు ఎరుపు రంగు ఆమె నిర్ణయాల్లోని ప్రతికూల భావాలను సూచించేలా ఎంపిక చేశామని తెలిపారు. ప్రతి రంగు, ప్రతి డిజైన్ వెనుక ఒక ఉద్దేశం ఉందని, సినిమా చూసిన తర్వాతే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు.

‘రామాయణ’లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, శత్రుఘ్నుడిగా నితీశ్ శర్మ కనిపించనున్నారు. రామానంద్ సాగర్ రూపొందించిన ధారావాహికలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథుడి పాత్ర పోషిస్తున్నారు. కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్ ఝా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.