భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, ఆగస్టు 2026, గురువారంభారత్ సమాచార్

బొడ్డుపల్లి ఉపేంద్రంకు ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అవార్డు

WhatsApp Image 2026-08-05 at 4.53.20 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హైదరాబాద్‌లో నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320సీ – లెర్న్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ 2025–26 కార్యక్రమంలో మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ బొడ్డుపల్లి ఉపేంద్రం ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అవార్డు అందుకున్నారు. క్రీడల అభివృద్ధికి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారం మహబూబాబాద్ జిల్లా క్రీడా రంగానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు.

అవార్డు అందుకున్న అనంతరం బుధవారం మహబూబాబాద్‌లోని బొడ్డుపల్లి ఉపేంద్రం నివాసంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ఉషోదయ వాకర్స్ జిల్లా అధ్యక్షుడు పాలబిందెల మల్లయ్యలు ఉపేంద్రంను శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేసి ఘనంగా అభినందించారు. ఆయన క్రీడా సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బొడ్డుపల్లి ఉపేంద్రం మాట్లాడుతూ తనకు లభించిన ఈ అవార్డు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా మహబూబాబాద్ జిల్లా క్రీడా కుటుంబానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా దుగ్గి కార్తీక్, సట్ల రాజు, సయ్యద్ పాషాతో పాటు తనను ప్రోత్సహించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలే తనకు మరింత ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా సమాజ సేవతో పాటు క్రీడాభివృద్ధికి మరింత కృషి చేస్తానని బొడ్డుపల్లి ఉపేంద్రం స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి కొనసాగిస్తానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు, మిత్రులు, సామాజిక కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.