భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చందు రాజకుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ కళాశాలలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన “ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి బీజేపీ లడాయి” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చందు రాజకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.15 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు పెరుమాండ్ల శివ సాయి గౌడ్, శ్రీకాంత్, బీజేపీ నాయకులు బాదావ సురేష్, తోట రమేష్, సురేష్, జబ్బర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.