భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసి ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రజా గాయకుడు, విప్లవ పోరాట యోధుడు గద్దర్ తన పాటలు, సందేశాల ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి విశేష సేవలు అందించారని అన్నారు. గద్దర్ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొని జయశంకర్ సార్, గద్దర్ సేవలను స్మరించుకున్నారు.