భారత్ సమాచార్, హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. న్యూట్రిషనిస్ట్‌గా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్న సారా.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్‌షిప్‌పై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. భవిష్యత్ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో చెప్పారు.
సారా తన తల్లిదండ్రులు సచిన్, అంజలి టెండూల్కర్ బంధాన్ని తనకు ఆదర్శంగా పేర్కొన్నారు. వారిద్దరూ భార్యాభర్తల కంటే ముందుగా మంచి స్నేహితులని, ఇంట్లో సరదాగా మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు ఫ్రెండ్లీగా సెటైర్లు వేసుకోవడం, నవ్వుతూ ఉండటం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని తెలిపారు. అందుకే తన భవిష్యత్ భాగస్వామిలోనూ స్నేహం, సరదా, పరస్పర అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పెళ్లి విషయంలో తాను ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోనని సారా స్పష్టం చేశారు. కేవలం కుటుంబం లేదా సమాజం నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. తనకు సరైన వ్యక్తి దొరికే వరకు పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశం లేదనే సంకేతాన్ని ఇచ్చారు. జీవిత భాగస్వామితో స్నేహపూర్వకమైన, పరస్పర గౌరవం ఉండే బంధాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.
జెన్‌జీ రిలేషన్‌షిప్స్‌పై కూడా సారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బంధం సరైనది కాదని అనిపిస్తే.. పెళ్లి వరకు వెళ్లి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం కంటే ముందుగానే ఆ బంధం నుంచి బయటకు రావడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. గత తరాలతో పోలిస్తే నేటి తరం తమకు నచ్చని విషయాలపై ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. దీంతో సారా తన భవిష్యత్ భాగస్వామిపై పెట్టుకున్న అంచనాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.