భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ముందుకు సాగుతున్నామని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పుష్పగుచ్ఛాలతో మంత్రికి స్వాగతం పలికారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రిని ప్రత్యేక శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ తదితరుల నాయకత్వంలో సాగిన పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో రూపొందిన రాజ్యాంగం భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన తెలంగాణ వీరులకు జేజేలు పలుకుతూ, ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రైజింగ్–2047తో సమగ్ర అభివృద్ధి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు వివరించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా భారీ ప్రయోజనం
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలోని మహాలక్ష్మి పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మహిళలు 4 కోట్ల 49 లక్షల సార్లు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.161 కోట్ల 49 లక్షల మేర ప్రయోజనం చేకూరిందన్నారు.
గృహజ్యోతితో 1.29 లక్షల కుటుంబాలకు జీరో విద్యుత్ బిల్లులు
విద్యుత్ శాఖ గృహజ్యోతి పథకం కింద మెదక్ జిల్లాలో 1,29,756 మంది విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా జిల్లాకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ.108 కోట్ల 80 లక్షల సబ్సిడీ అందించిందన్నారు. 2024 జనవరి నుంచి 2026 జూలై వరకు 6,663 బావులకు రూ.49 కోట్ల 97 లక్షల వ్యయంతో విద్యుత్ కనెక్షన్లు విడుదల చేసినట్లు తెలిపారు.
రైతు భరోసాతో 2.66 లక్షల మంది రైతులకు రూ.222 కోట్లు
పట్టా పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పెట్టుబడి మద్దతు పథకం కింద ఎకరానికి రూ.6,000 అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 2026 వానాకాలం సీజన్‌కు సంబంధించి మెదక్ జిల్లాలో 2,66,674 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.222 కోట్ల 69 లక్షలు జమ చేసినట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 28,933 ఎకరాల్లో కంది, మినుము, పెసర, సోయాబీన్, మక్కజొన్న, ఆముదం, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర ఆరుతడి పంటలు సాగు చేసినట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 39,339 మంది పేదలు వైద్య చికిత్సలు పొందారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.110 కోట్ల 84 లక్షలు ఖర్చు చేసిందని వివరించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం
మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలోని 1,076 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 5,633 మంది గర్భిణీలు, 3,771 మంది బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు 24,954 మంది పిల్లలకు టేక్‌హోమ్ రేషన్ అందిస్తున్నామని చెప్పారు. మూడు నుంచి ఆరేళ్ల వయస్సున్న 22,979 మంది పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు, సంపూర్ణ భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు 100 శాతం విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు టేబుళ్లు, బుక్ ర్యాక్స్, ప్రీ-స్కూల్ పుస్తకాలు, యూనిఫారాలు అందించామని తెలిపారు. ఆటపాటలతో కూడిన ప్రీ-స్కూల్ విద్యను అందిస్తూ అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేశామన్నారు.
రూ.500కే వంటగ్యాస్
గృహజ్యోతి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 1,27,000 మంది లబ్ధిదారులకు 8,64,388 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.26 కోట్ల 14 లక్షలు సబ్సిడీగా ఖర్చు చేసిందన్నారు.
ఉచిత సన్నబియ్యం పంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మెదక్ జిల్లాలో 2,42,353 కుటుంబాలకు చౌక ధర దుకాణాల ద్వారా మూడు నెలలకు సరిపడే 15,033 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఒకేసారి ఉచితంగా పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 28,582 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, పిల్లలను చేర్చడం, ఇతర మ్యుటేషన్ల ద్వారా 1,06,448 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డుల్లో చేర్చినట్లు వెల్లడించారు.
రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు
2025-26 యాసంగి సీజన్లో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,00,344 మంది రైతుల నుంచి 4,25,305 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.1,016 కోట్ల 6 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డులు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి తెలిపారు. 2026 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. మెదక్ జిల్లాలో 2,41,393 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు.
విద్యారంగానికి పెద్దపీట
2026-27 విద్యా సంవత్సరంలో మెదక్ జిల్లాలోని 905 ప్రభుత్వ పాఠశాలల్లో 72,896 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లాకు రెండు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరయ్యాయని చెప్పారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉంటుందని వివరించారు. జిల్లాలోని 120 ప్రాథమిక పాఠశాలల్లో 1,417 మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నామని, 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చిన్న మరమ్మతుల కోసం రూ.326 లక్షలు మంజూరు చేశామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదలకు సొంతింటి కల
సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల సబ్సిడీతో గౌరవప్రదంగా నివసించేలా పక్కా ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో రూ.447.75 కోట్ల బడ్జెట్‌తో 8,955 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించామని, ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గుడిసెలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంజూరైన ఇళ్లలో 7,382 ఇళ్ల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయని, 4,353 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 6,309 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.169 కోట్ల 18 లక్షలు నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు.
భూముల రీ-సర్వేలో మెదక్ జిల్లాకు అగ్రస్థానం
రాష్ట్రంలో భూముల రీ-సర్వే, డిజిటల్ సర్వే చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో 10 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిందని చెప్పారు. దీనికి సంబంధించి 9(2) నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం వాటిని పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు అందించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రీ-సర్వేలో మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు.
వనమహోత్సవంలో 14.30 లక్షల మొక్కలు
అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో 31 లక్షల 95 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 14 లక్షల 30 వేల మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు.
మహిళా సంఘాలకు భారీగా బ్యాంకు రుణాలు
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో 12,000 సంఘాలకు రూ.610.72 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు అందించాలనే లక్ష్యానికి గాను ఇప్పటివరకు 1,819 సంఘాలకు రూ.145.62 కోట్ల రుణాలు అందించినట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు చిన్నతరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ రుణాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
జిల్లాలోని 391 ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.39.10 కోట్లకు సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2026 జూన్ 25న వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని తెలిపారు. 20 మండల సమాఖ్యలకు రూ.7.20 కోట్లతో 20 బస్సులు కొనుగోలు చేసి టీజీఆర్టీసీకి అందించామని, ఈ బస్సుల ద్వారా ప్రతి మండల సమాఖ్యకు నెలకు రూ.69,468 ఆదాయం వస్తుందని వివరించారు.
మెప్మా ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం
మెప్మా ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 134 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.18.27 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 854 మహిళా సంఘాలకు రూ.3.09 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని, ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 50 వ్యక్తిగత యూనిట్లకు రూ.98 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధి పనులకు రూ.98.51 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ ద్వారా మెదక్ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1,086 పనులకు రూ.98.51 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. వీటిలో 271 పనులు పూర్తయ్యాయని, మరో 438 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఎస్డీఎఫ్ కింద మొత్తం 219 అభివృద్ధి పనులు మంజూరు కాగా, 42 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు అభినందనలు
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టేందుకు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లోని సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేశారని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వనదుర్గా అమ్మవారి ఏడుపాయల ఆలయంలో వసతి గృహాల ఏర్పాటుకు టూరిజం శాఖ ద్వారా రూ.7 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మెదక్ పోర్టు పునరుద్ధరణ కోసం రూ.57 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సన్మానం
జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల విజయవంతానికి ప్రజలు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు అందించిన సహకారాన్ని మంత్రి అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రత్యేక అధికారి ఎ. వాణి ప్రసాద్ ఆధ్వర్యం కీలకంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో రూ.3.5 కోట్ల జంబో చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులు, ఉద్యోగులను మంత్రి అభినందించారు. మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలు, ఉద్యోగులు, అధికారులు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.