భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలు, పోలీస్ స్టేషన్, అంగన్వాడీ కేంద్రాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఇనుగుర్తి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి, ఎంపీడీవో పార్థసారథితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై పి.నరేష్ పోలీస్ సిబ్బందితో కలిసి పతాకావిష్కరణ చేశారు. పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్, హైస్కూల్లో హెచ్ఎం అమ్మ యాకయ్య, గ్రామపంచాయతీలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వివిధ గ్రామాల్లోనూ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్ననాగారం గ్రామపంచాయతీలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, పెద్దతండాలో రేణుక నరేష్, కోమటిపల్లిలో మద్దెల బిక్షపతి గౌడ్, చీన్యతండాలో జాటోత్ హరిచందు, చిన్నముప్పారంలో రాయలి భవాని శేఖర్, మీత్యతండాలో చిన్ని వెంకన్న జాతీయ జెండాలను ఎగురవేశారు. చిన్నముప్పారం హైస్కూల్లో ఎంఈఓ, హెచ్ఎం వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, యువజన సంఘాల్లోనూ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియజేసి దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించారు. మండలవ్యాప్తంగా జరిగిన వేడుకలు జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాగాయి.