భారత్ సమాచార్, పశ్చిమగోదావరి జిల్లా: పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇరగవరం మండలం అయితంపూడి లాకుల సమీపంలో అదుపుతప్పిన కారు నరసాపురం పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందగా.. మరో విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రానికి నలుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల్లో కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరికి చెందిన పోతుల లక్ష్మీభానువికాస్ (18), నాగిరెడ్డి దుష్యంత్ సాయి (18), చెరుకూరి రాజారాం చరణ్ (16), అమలాపురంలోని చాకూరుకు చెందిన నాగాబత్తుల సాయిసూర్యతేజ (19), పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని చింతపర్రుకు చెందిన వీరమల్లు సాయి వెంకటకిరణ్ (18) ఉన్నారు. అయితే వీరిలో రాజారాం చరణ్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆచంట మండలం వల్లూరుకు చెందిన మట్టా సంతోష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. చెట్టు కొమ్మను పట్టుకోవడంతో స్థానికులు అతడిని కాపాడారు.
వీరంతా పెరవలిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పెరవలి నుంచి నరసాపురం బయలుదేరిన వారు మార్గమధ్యంలో ఓగిడిలో ఓ స్నేహితుడిని కలిశారు. అనంతరం అయితంపూడి మీదుగా వెళ్తుండగా నరసాపురం వైపు తిరిగే క్రమంలో లాకుల వద్ద కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో వర్షం కురుస్తుండగా ఎదురుగా ఉన్న కాలువను గుర్తించలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలువలో నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో కారు ప్రవాహంలో సుమారు 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితంపూడి లాకుల వద్ద భానువికాస్, కొంతదూరంలో సాయి వెంకటకిరణ్, నెగ్గిపూడి లాకుల వద్ద దుష్యంత్ సాయి, మార్టేరు సమీపంలో సాయి సూర్యతేజ మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజారాం చరణ్ కోసం గాలింపు కొనసాగుతోంది. చరణ్ మినహా మిగిలిన విద్యార్థులు నరసాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. అందరూ 20 ఏళ్లలోపు యువకులు కావడంతో రెండు జిల్లాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.