భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, ఆగస్టు 2026, మంగళవారంభారత్ సమాచార్

రేవణపల్లి నుంచి UK వరకు.. ఏనుగు జైపాల్‌రెడ్డి సక్సెస్ జర్నీ

channels4_profile

“ఇంగ్లిష్ మాట్లాడలేను.. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి.. విదేశాల్లో ఉద్యోగం ఎలా సాధించాలి?” ఒకప్పుడు ఈ ప్రశ్నలతో భయపడిన ఓ తెలుగు మీడియం విద్యార్థి.. నేడు యూకేలో సైబర్ సెక్యూరిటీ రంగంలో కంపెనీ స్థాపించి, కెరీర్ స్కిల్స్‌పై యువతకు మార్గదర్శనం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో “అరేయ్ తమ్ముళ్లు.. ఎట్లుర్రా! అండ్ సిస్టర్స్..” అంటూ పలకరిస్తూ లక్షలాది మంది యువతకు చేరువైన ఏనుగు జైపాల్ రెడ్డి ప్రయాణం.. కేవలం సక్సెస్ స్టోరీ కాదు.. భయాన్ని జయించి, నేర్చుకోవాలనే పట్టుదలతో ఎదిగిన ఓ యువకుడి స్ఫూర్తిదాయక కథ.

 

భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: ఇంగ్లిష్‌ మాట్లాడాలంటే భయపడిన ఓ తెలుగు మీడియం విద్యార్థి.. నేడు యూకేలో సైబర్ సెక్యూరిటీ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి, కెరీర్ స్కిల్స్‌తో యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అతడే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి సమీపంలోని రేవణపల్లికి చెందిన ఏనుగు జైపాల్ రెడ్డి. కెరీర్ కోచ్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా విద్యార్థులు, ఉద్యోగార్థులు, విదేశాల్లో చదువుకునే యువతకు ఉపయోగకరమైన సూచనలు అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

జైపాల్ రెడ్డి చిన్నప్పటి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ను ఇంగ్లిష్‌ మీడియంలో పూర్తి చేశారు. ఇంగ్లిష్‌ చదవడం, రాయడం వచ్చినా మాట్లాడే విషయంలో భయపడేవారు. విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్చుకున్నారు. ఆ తర్వాత స్కాట్లాండ్‌కు వెళ్లినప్పుడు అసలు సవాళ్లు ఎదురయ్యాయి. భాషపై పూర్తి పట్టు లేకపోవడంతో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించినా, ఇంటర్వ్యూల్లో తన ఆలోచనలను చెప్పడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని జైపాల్ రెడ్డి చెబుతున్నారు.

అయితే సమస్యల నుంచి వెనక్కి తగ్గకుండా తనలోని భయాన్ని అధిగమించేందుకు ప్రయత్నించారు. “భయపడితే భాష రాదు.. మాట్లాడితేనే వస్తుంది” అనే ఆలోచనతో నిరంతరం ఇంగ్లిష్‌లో మాట్లాడటం, నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. క్రమంగా భాషపై పట్టు సాధించి ఉద్యోగంలో స్థిరపడ్డారు. కొన్నేళ్లు పనిచేసిన అనంతరం సొంతంగా టెక్‌ఫోర్స్‌ కంపెనీని ప్రారంభించి, తనకు వచ్చిన అనుభవాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకునే దిశగా అడుగులు వేశారు.

ఉద్యోగం, కెరీర్‌ విషయంలో తనను సంప్రదించే వారి సంఖ్య పెరగడంతో సోషల్‌ మీడియా ద్వారా యువతకు మార్గదర్శనం చేయాలని నిర్ణయించుకున్నారు. రెజ్యూమ్‌ ఎలా తయారు చేసుకోవాలి? ఇంటర్వ్యూకు ఎలా సిద్ధం కావాలి? ఇంగ్లిష్‌ రాకపోతే విదేశాల్లో ఉద్యోగం సాధించలేమా? వంటి ప్రశ్నలకు వీడియోల రూపంలో సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ స్కిల్స్‌, కెరీర్‌ ప్లానింగ్‌ వంటి అంశాలపై సులభమైన భాషలో అవగాహన కల్పిస్తున్నారు.

“అరేయ్ తమ్ముళ్లు.. ఎట్లుర్రా! అండ్ సిస్టర్స్..” అంటూ ఆయన చేసే పలకరింపు సోషల్‌ మీడియాలో ప్రత్యేక గుర్తింపుగా మారింది. పుస్తకాల్లో చదివిన సిద్ధాంతాలను మాత్రమే చెప్పకుండా, తాను ఎదుర్కొన్న వాస్తవ అనుభవాలను యువతతో పంచుకోవడం ఆయన కంటెంట్‌కు ప్రత్యేకతగా మారింది. ఉద్యోగంలో ఎదగడం, బాస్‌తో ఎలా వ్యవహరించాలి, కార్పొరేట్‌ వాతావరణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి వంటి అంశాలపై కూడా సూచనలు అందిస్తున్నారు.

‘ఆస్క్ జైయూకే’ పేరుతో సోషల్‌ మీడియా వేదికల ద్వారా యువతకు కెరీర్‌ మార్గదర్శనం అందిస్తున్న జైపాల్ రెడ్డి.. తెలుగు మీడియంలో చదివినా, ఇంగ్లిష్‌పై మొదట్లో భయం ఉన్నా అది జీవితంలో అడ్డంకి కాదని చెబుతున్నారు. “తెలుగు మీడియం, ఇంగ్లిష్ వీక్‌” అనే విషయాలను బలహీనతలుగా కాకుండా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలుగా చూడాలి అనేది ఆయన సందేశం. తన ప్రయాణం ద్వారా ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువతలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.