భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, ఆగస్టు 2026, బుధవారంభారత్ సమాచార్

ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే మురళీనాయక్

c6936513-ce33-4f79-9e93-e5ace7aec44c

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి నష్టాలను నివారించుకునేలా గ్రామాల్లో సర్పంచులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళీనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ హాజరయ్యారు. సమీక్షలో పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మునిగలవీడు సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, శ్రీరామగిరి మాదరి ప్రశాంత్, బంజర బాలకృష్ణ, సౌల్లతండా సుజాత వాసు, రాజులకొత్తపల్లి కొండ జనార్దన్‌రెడ్డి, రామన్నగూడెం బండి శ్రీనివాస్, ఆలేరు నాయిని పద్మ సత్యపాల్‌రెడ్డి తదితరులు తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ కాలువల్లో పూడిక, చెట్ల తొలగింపునకు మండలానికి రూ.55 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇళ్లు నిర్మించుకోని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన ఇతరులకు ఇళ్లు కేటాయించాలని సర్పంచులకు సూచించారు. మరో రెండు నెలల తర్వాత తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముందుగానే ప్రత్యామ్నాయ నీటి వనరుల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఫోన్ లిఫ్ట్ చేయకుంటే సహించేది లేదు:

సర్పంచులు ఫోన్ చేసినప్పుడు విద్యుత్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు వెంటనే స్పందించి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మురళీనాయక్ సూచించారు. ఫోన్లు లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, అవసరమైతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. సర్పంచులు ప్రజలచే ఎన్నుకోబడిన గ్రామ ప్రథమ పౌరులని, వారికి ప్రత్యేక గౌరవం, విలువ ఇవ్వాలని సూచించారు. సమీక్ష సమావేశానికి హాజరుకాని సర్పంచుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని 31 మంది సర్పంచుల్లో 11 మంది సమావేశానికి గైర్హాజరయ్యారని తెలిపారు. సమీక్ష సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకాని సర్పంచులు అభివృద్ధి పనుల కోసం ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధిపై నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా హాజరై సమయపాలన పాటించాలని సూచించారు.

సమస్యలపై వినతిపత్రం అందజేసిన సర్పంచులు:

మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే మురళీనాయక్‌కు వినతిపత్రాలు అందజేశారు. సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో డ్రాలో ఉపసర్పంచులు సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎంపీడీవోలతో సమన్వయం చేసి బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, జీపీ సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా శానిటేషన్ తదితర పనులు వెనుకబడుతున్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, స్పెషల్ ఆఫీసర్ మరియన్న, ఎంపీడీవో సింగారపు కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.