భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, ఆగస్టు 2026, గురువారంభారత్ సమాచార్

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది విద్యార్థులే: ఎస్పీ

rupa_V_gif–442×260-4g

భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు గతంలో విద్యార్థులుగా ఉన్న ఇద్దరు మైనర్లు ఈ ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. రూపా రెడ్డి చివరిసారిగా తన పిన్నితో మాట్లాడుతూ ‘బాబు’ అని సంబోధించినట్లు గుర్తించిన పోలీసులు, ఆమె స్కూల్ విద్యార్థులను కూడా అదే విధంగా పిలిచేవారని తెలుసుకుని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

హత్య అనంతరం నాలుగు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ఇవ్వగా, తిరిగి పాఠశాల ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉండగా, ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా డబ్బులు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు లభించింది. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడి వద్ద లభించిన నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వాటిని ల్యాబ్‌కు పంపగా, అవి రూపా రెడ్డి రక్తమని నిర్ధారణ అయినట్లు ఎస్పీ వెల్లడించారు.

నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్‌లో ఉండేవాడని, అతనికి మద్యం అలవాటు, బైక్‌లపై ఆసక్తి ఉండేదని పోలీసులు గుర్తించారు. అతని బ్యాగులో నగదు, ఫోన్ గుర్తించిన రూపా రెడ్డి మందలించి హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చినట్లు, అప్పటి నుంచి ఆమెపై అతనికి కోపం పెరిగినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. నెల రోజుల క్రితమే నిందితుల్లో ఒకరు గోవాకు వెళ్లినట్లు, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల క్రితమే రూపా రెడ్డి ఇంట్లో దొంగతనం చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నెల 11న పాఠశాల నుంచి వచ్చిన అనంతరం ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి రూపా రెడ్డి ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరి మాస్క్ జారిపోవడంతో రూపా రెడ్డి అతన్ని గుర్తించిందని, దీంతో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి నగదు, ఫోన్ తీసుకుని పరారైనట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్, రూపా రెడ్డికి చెందిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నిందితులు మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జస్టిస్ కోర్టుకు పంపనున్నట్లు తెలిపారు.