భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ పిలుపునిచ్చారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మద్దెల లక్ష్మీ–సారయ్య నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులతో పాటు స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్, కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ్ రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో పక్కా ఇళ్లలో జీవించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరో 1,000 ఇళ్లను తీసుకువచ్చారని తెలిపారు. పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని ఆమె తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, గృహాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గడపగడపకు వెళ్లి వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఉమా మురళి నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు వీరన్న నాయక్, పద్మ, సత్యపాల్ రెడ్డి, చైతన్య, నాగరాజు, హేమలత, శ్రీను, మమత, ప్రశాంత్, కళ్యాణి, యాకాంతం తదితరులతో పాటు పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు బాలాజీ నాయక్, ప్రభాకర్ గౌడ్, మద్దెల సమ్మయ్య, బెల్లి నరసయ్య, పత్తిపాక తిరుపతాచారి, మద్ది రాజేష్, కొప్పు శ్రీను, నరేష్ తదితరులు పాల్గొన్నారు.