భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటో నడిపిన మాజీ మంత్రి

ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటో నడిపిన మాజీ మంత్రి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి రాథోడ్ ముందుగా గ్రామ దేవత బొడ్రాయిని మొక్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్ల సమస్యలను సత్యవతి రాథోడ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారికి మద్దతుగా స్వయంగా ఆటో నడిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకు తరలివచ్చిన ఆటో కార్మికులకు కిరాయి అందించి తన సానుభూతిని తెలిపారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి వారికి ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 1000 రోజులు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇక మిగిలింది 800 రోజులు మాత్రమేనని, ఈ సమయంలోనైనా హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు వారి సమస్యలపై తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు. పెద్దతండాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.