భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

శభాష్‌పల్లిలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభించిన ఎంపీ

శభాష్‌పల్లిలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభించిన ఎంపీ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో జాతీయ రహదారి–44పై నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్‌, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఇంధన అవసరాల కోసం భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్న విధంగా దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం భవిష్యత్తులో దేశాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ఎలక్ట్రిక్‌ వాహనాలు, సౌర విద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఇంటిపై సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు. సోలార్‌ వ్యవస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు.

సౌర విద్యుత్‌ వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడవచ్చని ఎంపీ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మరిన్ని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలని కోరారు.

బ్రాహ్మణపల్లి రైల్వే బ్రిడ్జికి హామీ

తూప్రాన్‌–శివంపేట మధ్య బ్రాహ్మణపల్లి రైల్వే గేట్‌ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నెల రోజుల్లో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేయించి, బ్రాహ్మణపల్లి రైల్వే బ్రిడ్జి మంజూరుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.