భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురు సమీపంలోని శ్రీ రామకృష్ణ గురుకుల పాఠశాలలో 2001–2002 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలుసుకుని సందడి చేశారు. స్థానిక అమూల్య గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తమ బిజీ జీవితాన్ని కొంతసేపు పక్కన పెట్టి బాల్య స్మృతులను, పాఠశాలలో గడిపిన రోజులను, తోటి మిత్రులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ప్రస్తుతం ఎక్కడ స్థిరపడ్డారు, ఏ రంగంలో పనిచేస్తున్నారు, కుటుంబ సభ్యులు, పిల్లలు ఎలా ఉన్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్నప్పటికీ తమ మధ్య ఉన్న స్నేహబంధం ఏమాత్రం తగ్గలేదని పలువురు పేర్కొన్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చిన్ననాటి అనుభవాలను పంచుకోవడంతో సమ్మేళనం సందడిగా సాగింది.
తమకు విద్యాబుద్ధులతో పాటు జీవిత పాఠాలను బోధించి, ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గనిర్దేశం చేసిన నాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ప్రస్తుత సీనియర్ జర్నలిస్టు గొల్లపల్లి విజయ్ బాబు గౌడ్, టిపిటిఎఫ్ జిల్లా బాలాస్టి రమేష్, కృష్ణమాచారి, పెరుమాండ్ల కుమార్, బొడ్డు యాకయ్య, రాస వెంకటరెడ్డి, కందగట్ల రమేష్, సాయికుమార్, బ్రహ్మయ్య, ఉప్పలయ్య, మురళీకృష్ణ, రాధాకృష్ణలను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాలు గడిచినా ఎక్కడ కలిసినా తమ పట్ల గౌరవభావంతో ఉంటూ గురుశిష్యుల అనుబంధాన్ని చాటిచెబుతున్న పూర్వ విద్యార్థుల తీరును అభినందించారు. తమను గుర్తు చేసుకుని ఆత్మీయంగా సన్మానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, విశ్రాంత ఉపాధ్యాయులు కూరపాటి వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
SEO వివరాలు