భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని సర్పంచి పులి వెంకన్న అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ యజమాని దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సర్పంచి పులి వెంకన్న మాట్లాడుతూ నెల్లికుదురు పట్టణంలో ప్రతి పేద కుటుంబం సొంతంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ సహకారంతో నెల్లికుదురు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా గృహం నిర్మించుకునే అవకాశం కల్పించేలా విడతల వారీగా ఇళ్ల మంజూరు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఇళ్ల మంజూరులో దళితులు, గిరిజనులు, వృద్ధులు, వికలాంగులు, గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తామని సర్పంచి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు. పేదలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్ది రాజేష్, మద్ది కృష్ణమూర్తి, సలుగు వీరేష్, పులి సాంబయ్య, ఆకుల రాములు, సోమయ్య, రమేష్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.