భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్య అని బీజేపీ తుంగతుర్తి మండల అధ్యక్షులు నారాయణదాస్ నాగరాజు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారాపరాజు రామచందర్ రావు పిలుపు మేరకు, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆదేశాల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.15 వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “బకాయి ఫీజులు – బీజేపీ లడాయి” కార్యక్రమాన్ని చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం కుట్రపూరిత చర్య అని నాగరాజు అన్నారు. అరెస్టులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పలువురు విద్యార్థులకు ఆయా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని నాగరాజు తెలిపారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజుల సమస్యల కారణంగా ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ముందస్తు అరెస్టులకు గురైన వారిలో తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కత్తుల నరేష్, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే రఫీక్, వార్డు సభ్యులు రవి, వెంకన్న, సందీప్, బీజేవైఎం జిల్లా నాయకులు పోడేటి సాయికృష్ణ, భరత్ తదితరులు ఉన్నారు. అరెస్టులు చేసినప్పటికీ విద్యార్థుల తరఫున ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.