భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి అవమానం.. భగ్గుమన్న బీఆర్‌ఎస్ నేతలు

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి అవమానం.. భగ్గుమన్న బీఆర్‌ఎస్ నేతలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్‌ఎస్ నేతలు నల్లదుస్తులతో నిరసన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గులాబీ శ్రేణులు నర్సాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ముఖద్వారం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పోలీసుల తీరును, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధి పట్ల కనీస గౌరవం పాటించకుండా పోలీసులు వ్యవహరించడం సరికాదని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరని అన్నారు.

మహిళా ప్రజాప్రతినిధికే అసెంబ్లీ వద్ద కనీస గౌరవం లభించకపోతే దీనిని ప్రజాపాలన ఎలా అంటారని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి జరిగిన అవమానంపై ప్రభుత్వం, పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.