భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కరెంటు కోతలను వెంటనే ఎత్తివేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.500 సబ్సిడీ గ్యాస్‌ను అందించాలని కోరుతూ బీజేపీ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజకుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎంపీడీవో సింగారపు కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చందు రాజకుమార్ మాట్లాడుతూ మండలంలోని పలు ప్రాంతాల్లో రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. తరచూ కరెంటు కోతల కారణంగా రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు చీకట్లో ఉండాల్సి వస్తోందని, దోమల బెడదతో మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న రూ.500 సబ్సిడీ గ్యాస్ పథకం అర్హులైన అనేక మందికి అందడం లేదని రాజకుమార్ పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సబ్సిడీ గ్యాస్ అందేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాస యాకిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కుక్కల ఐలయ్య, సీనియర్ నాయకులు చట్ల సంతోష్, జెల్ల రమేష్, సలుగు ప్రవీణ్, మోడం నరసయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శ్రీకాంత్, జిలక యాకయ్య, శ్రీను, భూక్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.