భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఎమ్మెల్యే సునీతారెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే సునీతారెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: కాంగ్రెస్ నేతలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఆమె రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వికాస యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఆమె తన తప్పులను అంగీకరించాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు నర్సాపూర్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించారని ఆరోపించారు.

నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేసిన నష్టాన్ని గతంలో ఎవరూ చేయలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కల్పన జరగలేదని, కుల వృత్తుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. సునీతా రెడ్డితో కలిసి పనిచేయలేకనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు హరీశ్‌రావు వద్దకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కేవలం కల మాత్రమేనని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధి అందిస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నర్సాపూర్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ గుప్తా, సురేష్ నాయక్, రాజేష్, ఉదయ్ కుమార్, శివకుమార్, ఆంజనేయులు గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.