భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

సత్వరమే ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

సత్వరమే ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

సోమవారం మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 61 దరఖాస్తులు అందాయి. వీటిలో భూభారతికి సంబంధించి 22, ఇందిరమ్మ ఇళ్లకు 9, పెన్షన్లకు 5, ఇతర సమస్యలకు సంబంధించిన 25 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అనంతరం సీఎం ప్రజావాణితో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.