భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌లను మంగళవారం నెల్లికుదురు పోలీసులు అడ్డుకున్నారు. సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్‌ఐ గంగారపు కరుణాకర్, ఇనుగుర్తి ఎస్‌ఐ పి. నరేష్ పోలీస్ సిబ్బందితో కలిసి వారిని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
కవిత, శంకర్ నాయక్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు తొర్రూరు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో కొంతసేపు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వారు ధర్నాను విరమించారు. అనంతరం కవిత, శంకర్ నాయక్‌లను పోలీస్ స్టేషన్‌లో ఉంచి పరిస్థితిని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో కవిత, శంకర్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్‌ను చావకొడతామని, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్ద చావు డప్పులు కొడతామని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఫామ్‌హౌస్‌పై దాడికి కొందరు కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారనే సమాచారం నేపథ్యంలో తమ నాయకుడు కేసీఆర్‌ను కాపాడుకునేందుకు ఎర్రవెల్లికి వెళ్తున్నామని, ఈ క్రమంలో పోలీసులు తమను అడ్డుకోవడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తుంటే పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నారని కవిత, శంకర్ నాయక్ ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా పోలీసులు అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ పరిణామాలన్నింటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారణమని ఆరోపించిన వారు.. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అనంతరం పోలీసులు కవిత, శంకర్ నాయక్‌లను వారి గృహాలకు పంపించారు.