భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

నెల్లికుదురు జీజేసీలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన

నెల్లికుదురు జీజేసీలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామి, స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్. శ్రీనివాసరావు కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు కుటుంబాల్లో కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించి మంచి లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని తెలిపారు.

మాదకద్రవ్యాలను ఎవరైనా వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మాణంలో యువత, విద్యార్థుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు తోటి విద్యార్థులను కూడా చైతన్యపరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ డా. ఎ. సుధాకర్, కళాశాల ఎన్ఎస్ఎస్-2 ప్రోగ్రాం ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు, అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాశ్ బాబు, కవిరాజు, యాకన్న, బాబు, రాంమూర్తి, మహేందర్, రఘురాం, సుభాష్, అధ్యాపకేతర సిబ్బంది ప్రదీప్, శ్రావణ్, లక్ష్మణ్, గౌరీశంకర్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.