భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలోని పద్మావతి కాలనీలో హిందూ ఉత్సవ సమితి నూతన కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమితి సభ్యులు, నాయకులు పాల్గొని కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో కమిటీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను భైంసాలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. వినాయక మండపాల్లో నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి మాట్లాడుతూ భైంసాలో వినాయక ఉత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. వినాయక ఉత్సవాల సందర్భంగా పట్టణంలో అవసరమైన ఏర్పాట్లను మున్సిపాలిటీ తరఫున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘ చాలక్ సాదుల కృష్ణదాస్, ఆర్ఎస్ఎస్ కుటుంబ ప్రభోదక్ సరికొండ దామోదర్, వి.హెచ్.పీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, మాజీ భైంసా ఏఎంసీ చైర్మన్ పీ. కృష్ణ, ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.