భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో సన్న వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వం అందిస్తున్న బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కేసముద్రం మార్కెట్ యార్డ్ కమిటీ ఇనుగుర్తి డైరెక్టర్ కొట్టం రాము సూచించారు. సన్న వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందేందుకు రైతులు సెప్టెంబర్ 10వ తేదీలోగా తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని మంగళవారం ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన సన్న వరి రకాలైన ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), బీపీటీ-5204 (సాంబా మసూరి), కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎం-7715 సాగు చేసిన రైతులు ఈ బోనస్‌కు అర్హులని కొట్టం రాము పేర్కొన్నారు. అయితే గడువులోగా పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసి సన్న వరి సాగు చేసిన రైతులు సంబంధిత విత్తన డీలర్ వద్దే పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సొంతంగా విత్తనాలు వినియోగించిన లేదా ఇతర రైతుల నుంచి విత్తనాలు తీసుకుని సాగు చేసిన రైతులు తమ గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) వద్ద పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్‌ను పొందాలని కొట్టం రాము కోరారు. సెప్టెంబర్ 10వ తేదీ చివరి గడువు కావడంతో రైతులు ఆలస్యం చేయకుండా పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. సన్న వరి సాగు చేసిన ప్రతి అర్హత కలిగిన రైతు బోనస్ పొందేలా సంబంధిత అధికారులు, డీలర్లను సంప్రదించి నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు.