భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

అన్యాయంపై అక్షరాయుధంతో పోరాడిన కాళోజీ

పాత తండాలో ఘనంగా కాలోజీ జయంతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం పాత తండాలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధిక్కార స్వరం, ఉద్యమ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచి ఇస్లావత్ నరేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ జీవితాన్ని, ఆయన ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచి ఇస్లావత్ నరేష్ మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం చోటుచేసుకున్నా కాళోజీ నారాయణరావు తన మాటలతో, రచనలతో ధైర్యంగా ఎదిరించేవారని అన్నారు. తన గేయాలు, కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ప్రజల సమస్యలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ సామాన్యుల గొంతుకగా నిలిచిన గొప్ప ప్రజాకవిగా కాళోజీ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కాళోజీ నారాయణరావు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని సర్పంచి అన్నారు. తెలంగాణ సాధన కోసం తన రచనలు, ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరిచిన ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. నేటి తరం కాళోజీ రచనలను చదివి, ఆయన ఆశయాలను తెలుసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే ధైర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి గడ్డి అశోక్, వార్డు సభ్యులు ఇస్లావత్ శ్రీధర్, బానోతు కౌసల్య, బాధావత్ అరుణ, గ్రామ పెద్దలు బాదావత్ బిచ్చ, ఏఎన్ఎం మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు.