భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంతో పాటు వ్యవసాయం, కూరగాయల సాగుపై అవగాహన కల్పించేందుకు రాజాపేట మండలం దూది వెంకటాపూర్ జెడ్పీహెచ్ఎస్లో కిచెన్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే వంకాయ, టమాటా, ఆకుకూరలు తదితర కూరగాయలను సాగు చేస్తూ విద్యార్థులకు వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తున్నారు.
కిచెన్ గార్డెన్లో మొక్కలను నాటడం, వాటికి నీరు అందించడం, సంరక్షించడం, వాటి ఎదుగుదలను గమనించడం వంటి అంశాల్లో విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. దీనివల్ల కూరగాయల సాగు విధానంపై ప్రాథమిక అవగాహనతో పాటు తాజా కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థుల్లో చైతన్యం పెరుగుతోంది.
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు సుంచు విజయలక్ష్మి ఆధ్వర్యంలో, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ రాగుల రవీందర్ పర్యవేక్షణలో పాఠశాల సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. తరగతి గదిలో నేర్చుకునే విషయాలను ఆచరణాత్మకంగా అనుభవించేలా కిచెన్ గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ప్రకృతి, వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల సిబ్బంది తెలిపారు. పాఠశాల ఆవరణలోనే కూరగాయల సాగును చేపట్టడం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.