భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు ఎంపిక అభినందించిన హెచ్ఎం అమ్మ యాకయ్య

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు మండల కేంద్రం ఇనుగుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ ట్రయల్స్‌లో ఇనుగుర్తి పాఠశాల విద్యార్థులు బొల్లు సహస్ర, బొల్లు రష్మి, మందుల నిఖిల్, బోళ్ల భోగేశ్వర్, గట్టిగొర్ల వర్షిత్ అసాధారణ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ఎంపికైన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నిర్వహించనున్న 11వ సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో మహబూబాబాద్ జిల్లా తరఫున పాల్గొననున్నారు. జిల్లా స్థాయి ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు ఎంపిక అభినందించిన హెచ్ఎం అమ్మ యాకయ్య

అభినందించిన హెచ్‌ఎం, టీచర్స్ బృందం..

రాష్ట్రస్థాయి పోటీలకు ఇనుగుర్తి హైస్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల హెచ్‌ఎం అమ్మ యాకయ్యతో పాటు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను అభినందించింది. ఒకవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే మరోవైపు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నతమైన అవకాశాలు లభిస్తాయని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, శిక్షణ అందిస్తున్న పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయుల బృందం ప్రత్యేకంగా అభినందించింది. ఆయన కృషి, విద్యార్థులకు అందిస్తున్న నిరంతర శిక్షణతోనే రాష్ట్రస్థాయి ఎంపిక సాధ్యమైందని ప్రశంసించారు.