భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమని ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ప్రిన్సిపాల్ కే. వీరస్వామి అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వీరస్వామి హాజరై కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి భాషలోని సహజత్వం, ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ ‘ప్రజాకవి’గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన సాహిత్యం నేటి యువతలో సామాజిక స్పృహను పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునేలా చేస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలని, తెలంగాణ భాషా వైభవాన్ని, సంస్కృతి ప్రత్యేకతలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయాలని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తెలుగు భాష ప్రాముఖ్యత, కాళోజీ సాహిత్యం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల తెలుగు అధ్యాపకులు డి. శ్రీనివాస్‌ను ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక బృందం అభినందించింది.
కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరు వెంకటేశ్వర్లు, అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాష్ బాబు, నాగేశ్వరరావు, రామ్మూర్తి, సుధాకర్, మహేందర్, యాకన్న, అధ్యాపకేతర సిబ్బంది శ్రావణ్, ప్రదీప్, గౌరీ శంకర్, లక్ష్మణ్, ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.