భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చదువుతో పాటు విద్యార్థులకు జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని, తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మెదక్ జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి అన్నారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ స్కూల్లో ఏబీసీ 3.0 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
హేమ భార్గవి మాట్లాడుతూ.. విద్యార్థులకు ‘నన్ను నేను తెలుసుకోవడం’, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం, బాధ్యతాయుత ప్రవర్తన, సరైన నిర్ణయాలు తీసుకోవడం, తమ బలాలు–బలహీనతలను గుర్తించడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్రంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులను చైతన్యపరిచామన్నారు. పిల్లల రక్షణ కోసం అందుబాటులో ఉన్న చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 గురించి వివరించి, బాలలకు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా సంబంధిత సహాయ వ్యవస్థలను ఆశ్రయించాలని సూచించారు.
విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని హేమ భార్గవి పేర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే సరైన ఆలోచనా విధానం, బాధ్యతాయుత ప్రవర్తన అలవర్చుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగగలరని అన్నారు. లైఫ్ స్కిల్స్ ట్రైనర్, ఏబీసీ 3.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత రాకేష్ కొర్రపాటి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కేవలం సమాచారాన్ని పెంచడం కాకుండా, వారి ఆలోచనా విధానంలో సానుకూల మార్పు తీసుకురావడమే ఏబీసీ 3.0 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తమను తాము అర్థం చేసుకుని, సామర్థ్యాలను గుర్తించి, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేలా జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
“అవగాహనతో ఆలోచన మారాలి.. ఆలోచనతో ప్రవర్తన మారాలి.. ప్రవర్తనతో భవిష్యత్తు మారాలి” అనే లక్ష్యంతో ఏబీసీ 3.0 కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సునీత రాకేష్ కొర్రపాటి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఉపాధ్యాయులు, సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.