భారత్ సమాచార్, న్యూఢిల్లీ: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్ జూనియర్‌ను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. న్యూఢిల్లీలో బుధవారం ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ఉత్పాదక సామర్థ్యం, ఎగుమతి అవకాశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లక్ష్యాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలపై కూడా చర్చించారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను భారీగా పెంచడం, ఇరు ప్రాంతాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడం, దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన మాంస ఉత్పత్తులు, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విత్తనాల కొనుగోలుపైనా ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్ జూనియర్ ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, విస్తారమైన ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యతతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించగలవని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి అంతర్జాతీయ మార్కెట్ ద్వారాలు తెరవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఎగుమతులు విస్తరించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు రైస్ మిల్లర్లు, విత్తన కంపెనీలు, మాంస ఉత్పత్తిదారులు, ఆహార శుద్ధి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని అన్నారు. వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానమైన లాభసాటి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ వ్యవసాయం, ఆహార శుద్ధి, విత్తనోత్పత్తి, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ–ఫిలిప్పీన్స్ మధ్య నూతన భాగస్వామ్యానికి బలమైన పునాది వేస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.