భారత్ సమాచార్, అమరావతి: వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తాను పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. “చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయాయి.. మరో ఏడాది కూడా అలాగే గడిచిపోతుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర సాగుతుంది” అని జగన్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బలంగా నిలబడి పోరాడాలని, ఎన్నికలు నిజాయితీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తలు గర్వపడేలా మన పాలన: వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనకు, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనకు స్పష్టమైన తేడా ఉందని జగన్ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఈ విషయంపై చర్చ జరుగుతోందన్నారు. తమ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 నుంచి 3,300 ప్రొసీజర్లకు పెంచామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నాడు–నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని, విలేజ్ క్లినిక్లు, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఈ–క్రాపింగ్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధానాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించామని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు దగా చేశారంటూ ఆరోపణలు: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని జగన్ ఆరోపించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి తరహాలో రూ.15 వేల చొప్పున ఇస్తామని, మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.18 వేలు, రైతులకు రూ.26 వేలు, మహిళలకు రూ.48 వేల వరకు ప్రయోజనాలు, యువతకు రూ.36 వేల వంటి హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంపిణీ చేసి, సంతకాలతో హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటి అమలుపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. స్థానిక ఎన్నికల విషయంలోనూ ప్రభుత్వం డ్రామా చేస్తోందని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ జగన్ విమర్శలు చేశారు.
ఎన్నికలు సాఫీగా జరిగితే మనదే విజయం: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలు సాఫీగా జరుగుతాయని తాను భావించడం లేదని జగన్ అన్నారు. అక్రమ కేసులు, పోలీసు అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లు వంటి వాటితో ప్రతిపక్షాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. దౌర్జన్యంతో పాలకులు ఎప్పటికీ రాజ్యం చేయలేరని, గతంలో నంద్యాల ఉపఎన్నిక, అనంతరం తన పాదయాత్ర, 2019 ఎన్నికల ఫలితాలను ఇందుకు ఉదాహరణగా జగన్ పేర్కొన్నారు. పాలకుడికి నిబద్ధత, చిత్తశుద్ధి ఉండాలని, మంచి పనులు చేసి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు, డైవర్షన్ రాజకీయాలతో ప్రజల మద్దతు పొందలేరని జగన్ స్పష్టం చేశారు.