భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిషేధిత నల్లబెల్లం, పటిక, గుడుంబా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా భారీగా నల్లబెల్లం, పటిక, గుడుంబా పట్టుబడ్డాయి.
స్థానిక ఎస్ఐ గంగారపు కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పోలీసులు మండలంలోని పార్వతమ్మగూడెం స్టేజి సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని ఆపి సోదా చేయగా, సారాయి తయారీకి ఉపయోగించే 10 క్వింటాళ్ల నల్లబెల్లం, 1.5 క్వింటాళ్ల పటిక, 5 లీటర్ల గుడుంబా లభించినట్లు తెలిపారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని హేమ్లతండా శివారు ఇస్రాతండాకు చెందిన బానోతు శంకర్‌గా అతడిని గుర్తించినట్లు ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు సంబంధిత ట్రాలీ వాహనం, నల్లబెల్లం, పటిక, గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు మొత్తం విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని ఎస్ఐ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
నల్లబెల్లం, పటికను అక్రమంగా విక్రయించే, రవాణా చేసే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జి. కరుణాకర్ హెచ్చరించారు. గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటికతో పాటు సారాయి అక్రమ విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మండలంలో అసాంఘిక, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు