భారత్ సమాచార్, ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నగలు, పనికిరాని వస్తువులను ప్యాకెట్లలో ఉంచినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బ్యాంక్ మాజీ బ్రాంచ్ మేనేజర్ సహా ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మొత్తం 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించగా, సుమారు 6 కిలోల 449.50 గ్రాముల బంగారు ఆభరణాలు గల్లంతైనట్లు అధికారులు అంచనా వేశారు. వీటి మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ కేసులో 2016 నుంచి బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న చలపాక రాజును కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. 2025 మేలో కుమారపు భాస్కరరావు బ్రాంచ్ మేనేజర్‌గా, తన్నేరు అజయ్‌బాబు జాయింట్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టగా, అదే ఏడాది అక్టోబర్‌లో జంగల సాయిరాజ్ క్రెడిట్ ఆఫీసర్‌గా చేరారు. వీరంతా గోల్డ్ అప్రైజర్‌తో కుమ్మక్కై బంగారం మాయం చేయడానికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జూన్ 16న జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, జూలై 10న అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
చలపాక రాజు నుంచి, అతను బంగారం తాకట్టు పెట్టిన విక్రయ కేంద్రాల నుంచి పోలీసులు రూ.5.81 కోట్లకు పైగా విలువైన 4.120 కిలోల బంగారం, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్యాంకు రికార్డులు, లాకర్ కదలికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన పోలీసులు బ్యాంకు అధికారుల పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వెల్లడించారు. దీంతో మాజీ బ్రాంచ్ మేనేజర్ కుమారపు భాస్కరరావు (35), జాయింట్ మేనేజర్ తన్నేరు అజయ్‌బాబు (40), క్రెడిట్ ఆఫీసర్ జంగల సాయిరాజ్ (33)లను అరెస్ట్ చేశారు.
ఇప్పటివరకు రికవరీ చేసిన బంగారంతో పాటు మిగిలిన ఆభరణాలు ఎక్కడున్నాయి? నిందితుల మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇంకా రికవరీ కావాల్సిన బంగారు ఆభరణాల ఆచూకీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.