భారత్ సమాచార్, తిరుపతి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న 31వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు తిరుపతి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
సమ్మిట్‌కు ముందు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. అలాగే అక్టోబర్‌లో విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26న తిరుపతిలో ప్రాంతీయ సదస్సు జరగనుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడం, పెద్ద సంఖ్యలో పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలను కుదుర్చుకోవడం CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రధాన లక్ష్యాలని సాయి ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వర్గాలకు పరిచయం చేయడంతో పాటు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా సదస్సును విజయవంతం చేయాలని సూచించారు.
తిరుపతిలో అక్టోబర్ 26న నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ చీఫ్ సెక్రటరీకి వివరించారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసి, పారిశ్రామిక ప్రతినిధులు, పెట్టుబడిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.