భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వేదిక ఏర్పాటుతో పాటు ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు.
ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ గౌరవ వందనం, బందోబస్తు విషయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.