భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని వలిగొండ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని నాయకులు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ చేసిన సేవలు, ఆమె పోరాట పటిమ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న, సీనియర్ తెలంగాణ ఉద్యమకారులు సంగిశెట్టి క్రిస్టఫర్, ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్, ఎలిమినేటి సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ పబ్బు సురేందర్, సీపీఐ మండల నాయకులు బొడిగె సుదర్శన్, మైసొల్ల లక్ష్మీనర్సు, మైసొల్ల యాదగిరి, ఎండీ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.