భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శ్రీరామగిరి గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం పలు రకాల అనారోగ్య సమస్యలకు సంబంధించి జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సాయిరాం హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు సర్పంచి మాదరి ప్రశాంత్ తెలిపారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపసర్పంచి రామగిరి సుమన్, ప్రజా వైద్యులు డా. ఆదూరి కళాధర్ రాజు, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్, సీనియర్ నేత పత్తిపాక తిరుపతాచారి, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రొయ్యల చంటి, ఎడ్ల మహేష్ తదితరులతో కలిసి సర్పంచి ప్రశాంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచి మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ వైద్య శిబిరానికి గ్రామస్తుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న 144 మందికి ఆయా విభాగాలకు చెందిన స్పెషలిస్టు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు డా. జంగాల సునీల్ కుమార్, డా. జంగాల స్వాతి, డా. ప్రశాంతి, డా. తబస్సుమ్, జంగాల రాజేశ్వరరావు, సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.