భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రామానుజాపురంలో భూ రీసర్వే పనుల పరిశీలన

రామానుజాపురంలో అధికారులు భూ రీసర్వే పరిశీలన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రామానుజాపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను తొర్రూరు ఆర్డీఓ గణేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ గురువారం స్థానిక తహసిల్దార్ చంద నరేష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల గుర్తింపు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ గణేష్ పలు సూచనలు చేస్తూ రీసర్వే పనులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో భూ హద్దుల నిర్ధారణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.

రీసర్వేలో గుర్తించిన ప్రభుత్వ భూములు, ఇతర ప్రభుత్వ ఆస్తుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, వాటికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ సురేందర్‌తో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.