భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

గిరిజనుల సాగు భూముల్లో ఉద్రిక్తత

గిరిజనుల సాగు భూముల్లో ఉద్రిక్తత

భారత్ సమాచార్, పార్వతీపురం మన్యం జిల్లా: కాకర్లవలస గ్రామ సమీపంలో గిరిజనులు సాగు చేస్తున్న భూముల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజన రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా సాగులో ఉన్న పంటలను యంత్రాల సహాయంతో ధ్వంసం చేసినట్లు గిరిజనులు ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

కూటమి ప్రభుత్వం ఎస్సెంట్‌ డి పట్టా భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే చర్యల్లో భాగంగా సుమారు 65 ఎకరాల భూమిని రాధిక వెజిటబుల్ పరిశ్రమల స్థాపనకు కేటాయించినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ భూముల్లో తాము పంటలు సాగు చేసుకుంటున్నామని, పంట చేతికొచ్చే సమయంలో భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. అధికారులు పోలీసుల సహాయంతో భూముల్లోకి రావడంతో గిరిజన రైతులు వారిని అడ్డుకుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో గిరిజనులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులను ప్రశ్నించిన, అడ్డుకున్న పలువురు గిరిజనులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తమ సాగు భూములను కాపాడుకునేందుకు గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై తమకు హక్కులు ఉన్నాయని గిరిజన రైతులు స్పష్టం చేశారు. పంటలను ధ్వంసం చేసి భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, సాగు భూములపై గిరిజనుల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.