భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో యువకుడి మృతదేహం లభ్యం

వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో యువకుడి మృతదేహం లభ్యం

భారత్ సమాచార్, మార్కాపురం జిల్లా: పెద్దదోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 5న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో పుప్పాల వినయ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. మరో యువకుడు పుప్పాల రాజ్‌కుమార్ మృతదేహం కోసం పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఈ నెల 5న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్దకు వెళ్లిన వినయ్‌కుమార్, రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సుంకేసుల ఎస్సీ కాలనీ సమీపంలో వినయ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

అనంతరం మృతదేహాన్ని మార్కాపురం వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం వినయ్‌కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, రాజ్‌కుమార్ మృతదేహం ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతోనూ కాలువ పరిసరాలను పరిశీలిస్తున్నారు.

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో ఎర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్, పెద్దదోర్నాల ఎస్‌ఐ ఎస్. వెంకట రమణయ్య ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అహర్నిశలు గాలిస్తున్నారు. రాజ్‌కుమార్ మృతదేహం లభించే వరకు అన్ని మార్గాల్లో అన్వేషణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. కాలువలో నీటి ఉధృతి అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు.