భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నెల్లికుదురులో ఉత్తమ గురువులకు పురస్కారాలు

ఉత్తమ గురువులకు పురస్కారాలు ప్రధానం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ఉత్తమ గురువులుగా ఎంపికైన 23 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాందాస్‌తో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాలకు విద్యాబుద్ధులు అందిస్తూ ఆదర్శ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యారంగానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.

ఎంఈఓ రాందాస్ చేతుల మీదుగా స్కూల్ అసిస్టెంట్లు బి. బిక్షపతి, కె. వెంకటేశ్వర్లు, డి. మధుకర్, ఎం.డి. సలీం, ఎం. సోమయ్య, ఎం. వెంకటేష్, ఆర్. నాగమణి, పీజీటీలు పి. యుగేందర్, ఎం.డి. అబ్దుల్ నబీ, ఎం.డి. నూరిద్దీన్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం బి. రవీందర్, ఫిజికల్ డైరెక్టర్ ఎస్. ప్రవీణ్, టీజీటీ బి. లక్ష్మణ్ సింగ్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఎస్‌జీటీలు ఎం. రాకేష్, కె. చందన, ఎ. మమత, పి. రమేష్, వి. రజిని, జి. మురళి, కె. రాజు, టీజీటీ పి. నవీన్ కుమార్, సీఆర్‌టీ బి. సరోజ, సీఆర్‌పీ బి. కవితలకు కూడా ఉత్తమ పురస్కారాలు అందజేశారు.

కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎంలు జె. మంగతాయి, స్వప్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సొంటి రెడ్డి యుగంధర్ రెడ్డి, సంగ శ్రీనివాస్, ఎల్. రవీందర్, యాకయ్య, మండల రాజు, సిహెచ్. రమేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పలువురు అభినందనలు తెలిపారు.